Tuesday, February 20, 2018

చంపక గర్భితోత్పలమాల


చంపక గర్భితోత్పలమాల
సాహితీమిత్రులారా!"సుగ్రీవపట్టాభిషేకం" - అనే కావ్యం
"అబ్బరాజు హనుమంతరావు"గారు
కూర్చారు. ఇందులోని ద్వితీయాశ్వాసంలోని
120వ పద్యం గర్భకవిత్వం రకానికి చెందినది
"చంపక గర్భితోత్పలమాల" ఇందులో
ఉత్పలమాలలో చంపకమాలను ఇమిడ్చాడు
అబ్బరాజు హనుమంతరావుగారు.

చంపక గర్భితోత్పలమాల -
కుల్కుచుఁవారు తీరమున కుంజనిసార్ద్రపటమ్ములూడ్చి హొం
గొల్కుల పట్టుపుట్టములఁ గొబ్బునఁదాల్చి  సువర్ణభూషలం
దల్కుటొడళ్ళఁ బెట్టినృపపనందనమున్గయిసేసితేనెలే
యొల్కఁగఁ మాటనిచ్చిరి నవోత్పలచంపకమాలలామెకున్

దీనిలో గమనించవలసినదొకటి
ఇది ఉత్పలమాల దీనికి పాదానికి 20 అక్షరాలు
మరి చంపకమాలకు 21 అక్షరాలు పాదానికి
20 అక్షరాల ఉత్పలమాలలో 21 అక్షరాల చంపకమాల
ఎలాసాధ్యం ఇమిడ్చటానికి అంటే ఇందులో
కవి చమత్కరించినది ఒకటే మొదటి గణంలో
గురువు లఘువు లఘువు - భగణం కదా దాన్ని
నాలుగు లఘువులుగా మార్చిన చంపకమాల కనబడుతుంది.
ఇందులో కవి ప్రాసలో
కుల్కుచు అనేదాన్ని కులుకుచు - మొదటిపాదం
గొల్కుల - అనేదాన్ని - గొలుకుల - రెండవపాదం
దల్కు - అనేదాన్ని - దలుకు - మూడవపాదం
యొల్కఁగ - అనేదాన్ని - యొలుకఁగ - నాలుగవపాదం
మార్చిన చంపకమాల అవుతుంది గమనించండి.

కులుకుచుఁవారు తీరమున కుంజనిసార్ద్రపటమ్ములూడ్చి హొం
గొలుకుల పట్టుపుట్టములఁ గొబ్బునఁదాల్చి  సువర్ణభూష లం
దలుకుటొడళ్ళఁ బెట్టినృపపనందనమున్గయిసేసితేనెలే
యొలుకగఁ మాటనిచ్చిరి నవోత్పలచంపకమాలలామెకున్


Monday, February 19, 2018

విద్యున్మాలా గర్భిత విశ్వదేవీ వృత్తము


విద్యున్మాలా గర్భిత విశ్వదేవీ వృత్తము
సాహితీమిత్రులారా!ఆచార్య వి.యల్.యస్.భీమశంకరంగారి
"రసస్రువు"లోని పద్యం ఇది-
విద్యున్మాలా గర్భిత విశ్వదేవీ వృత్తము
విశ్వదేవీ వృత్తంలో విద్యున్మాలావృత్తం
ఇమిడ్చి కూర్చబడినది.

విశ్వదేవీ వృత్తం -
ఉద్యఃస్ఫూర్తిన్ వెల్గున్ నరోద్ఘుండు, వీడో
విద్యా విఖ్యాతుండో గవేషుండు కాడో,
సద్యఃకర్ముండౌనో విచారింప , ఈడీ
చోద్యంబెంతో వింతౌను, చోక్షంబు చూడన్

దీనిలోగర్భితమైన విద్యున్మాలా వృత్తం-
ఉద్యఃస్ఫూర్తిన్ వెల్గున్ నరోద్ఘుండు, వీడో
విద్యా విఖ్యాతుండో గవేషుండు కాడో,
సద్యఃకర్ముండౌనో విచారింప , ఈడీ
చోద్యంబెంతో వింతౌను, చోక్షంబు చూడన్

విద్యున్మాలా వృత్తం-
చూడన్ ఉద్యఃస్ఫూర్తిన్ వెల్గున్
వీడో  విద్యా విఖ్యాతుండో
కాడో సద్యఃకర్ముండౌనో
ఈడీ చోద్యంబెంతో వింతౌ


Sunday, February 18, 2018

భట్టీకావ్యం - రావణవధ


భట్టీకావ్యం - రావణవధ
సాహితీమిత్రులారా!
భట్టి కవి సంస్కృతంలో రావణవధ అనే కావ్యాన్ని కూర్చాడు.
దీనికి ఈ కవిపేరు మీదే భట్టీకావ్యం అనే పేరు వ్యవహారంలో
రూఢి అయింది. మల్లినాథసూరి, జయమంగళ, కుముకుదా
నంద మొదలైన వ్యాఖ్యాతలు దీన్ని భట్టికావ్యంగానే పేర్కొన్నారు.
దీనిలో 22 సర్గలున్నాయి. దీనిలోని ఇతివృత్తం రామునిచరిత్ర.
వాల్మీకి రామాయణకథనే అనుసరించినా అక్కడక్కడా చిన్నచిన్న 
మార్పులు చేశాడు. ఇందులో ఉత్తరకాండ రచించలేదు. 
అయితే కవిగారు ఇందులో సంస్కృతవ్యాకరణం బోధించాలనుకున్నాడు.
అదే ఇందులోని ప్రత్యేకత. వ్ాయకరణాన్ని సరళంగా బోధించడంకోసం
ఈ కథను వాడుకున్నాడు. ఇతివృత్తం రామకథ అయితే విషయబోధన
వ్యాకరణం. ఈ రెండింటిని సమన్వయించాడు. ఇందులో వ్యాకరణం
విషయక్రమం ఈ విధంగా  ఉంది-

సర్గలు 1-5 - ప్రకీర్ణక కాండాలు - (తిఙంతరూపాలను చెప్పేవి)
సర్గలు 6-9 - అధికారకాండాలు - (అధికార సూత్రాలను చెప్పేవి)
సర్గలు 10-13 - ప్రసన్నకాండాలు -(గుణ,అలంకారలకు లక్ష్యాలు)
సర్గలు 14-22 - తిఙంతకాండాలు - (లకారరూపాలు)

ఈ విధంగా భట్టికవి, వ్యాకరణానికీ, అలంకారశాస్త్రానికి సంబంధించిన 
అనే విషయాలను శ్రీరాముని ఇతివృత్తంతో జోడించి రచించాడు.
భట్టికావ్యానికి 22 వ్యాఖ్యలున్నాయి. 

Saturday, February 17, 2018

భర్గా శతకం


భర్గా శతకం
సాహితీమిత్రులారా!కపిలవాయి లింగమూర్తిగారి
దుర్గాశతకాన్ని గురించి
ముందు తెలుసుకున్నాం-
ఇప్పుడు రెండవదైన
భర్గా శతకం గురించి వివరంగా తెలుసుకుందాం-
దుర్గా శతకం ఆటవెలదులతో ప్రతిపద్యం
ఒక అలంకారంలో మొత్తం శతకమంతా
దుర్గ అవతారాన్ని అష్టాదశ శక్తిపీఠాలను
దుర్గ తత్వాన్ని మొదలైన అంశాలతో
కూర్చగా భర్గా శతకం శివుడు యతీశ్వరుడు
కావున యతిశతకంగా ఆయన లీలలతో
కూర్చారు. ఇందులోని విషయం
ఈశ్వరుని గురించైతే ప్రతి దానిలో
ఛందస్సుకు సంబంధించి యతులకును
గురించిన లక్ష్యగ్రంథంగా కూర్చారు.
ఉమాదేవిని(దుర్గను) ఆటవెలదిలో స్తుతించగా
శివుని గీతపద్యాలలోని మరోరకమైన తేటగీతిని
శివస్తుతికి వాడారు. దీనిలో 120 పద్యాలను కూర్చాడు.
దీనిలో ఛందోవిషయంగా-
యతిగవేషణం - 22 పద్యాలు
వ్యంజనాక్షర విరతులు - 35 పద్యాలు
ఉభయవళులు - 35 పద్యాలు
ప్రాసయతులు - 28 పద్యాలు
మొత్తం    - 120 పద్యాలు

స్వరయతి -

మృత తత్వంబు నీయది, ది పురుష
త్మరూపంబు నీయది, ఐంద్రవినుత
ఐంద్రజాలికుడవు నీవు కలాప
పనిషదర్థమవు నీవు భవ భర్గ - 01


వ్యంజనాక్షర యతి -

కంతు కడగంట గాల్పడే కాయికముగ
కాలఫణినైన దాల్పడే కైవసముగ
కైపు విసమైన నిల్పడే గౌరవముగ
కౌశికీపతి నినుమది నునె  భర్గ   - 23

ఉభయవళులు-

చలజా వల్లభా యస్మజ్ఞత మది
లచి యిడుముల నిడ కస్మ దార్తి బాపి
దుకొనవయ్య నే యుష్మదంఘ్రి యుగము
నెపుడు నమ్మితి నను భవదీయు భర్గ     - 58Thursday, February 15, 2018

దుర్గా శతకం


దుర్గా శతకం
సాహితీమిత్రులారా!"కపిలవాయి లింగమూర్తి"గారు
చేసిన "దుర్గా శతకం"
చిత్రకవిత్వంలో చెప్పదగినది.
నిజానికి జంట శతకాలు
దుర్గ - భర్గ శతకాలు అని
కూర్చారు. మనం ఇక్కడ కేవలం
దుర్గ శతకాన్నే చెప్పుకుంటున్నాము.
ఒకవైపు దుర్గకు సంబంధించి
మరోవైపు అలంకారాలను వివరించడం
ఇందులోని చిత్రం. సంస్కృతంలో
కూర్తబడిన భట్టీ రావణవధ తదితర
కావ్యాల్లో ప్రధానకథ ఒక అర్థంగాను
మరో అర్థంలో వ్యాకరణం ఉండేవిధంగా
కొన్ని కావ్యాలున్నాయి. వాటికోవలో
ఈ శతకం ఒకవైపు దుర్గగురించి
మరోవైపు ఒక్కొక పద్యం ఒక్కొక అలంకారంగా
కూర్చారు కపిలవాయి లింగమూర్తిగారు.
ఇంకా వివరాల్లోకెళితే
తెలంగాణాలోని ఉమామహేశ్వర క్షేత్రంలోని
ఉమాదేవి త్రిపురసుందరి కనుక
అలంకారశతకంలో ఆమె సౌందర్యలీలలు
వర్ణిస్తూ ఆటవెలది స్త్రీ కావున అవ్నీ
ఆటవెదులుగానే కూర్చారు.
దుర్గ నవదుర్గ కావున నవ సంఖ్య వచ్చే విధంగా
వాటిని కూర్చారు.
ఇందులో వారు 109 పద్యాలను కూర్చారు.
దుర్గ అంగ వర్ణన             - 40 పద్యాలు
అష్టాదశ శక్తిపీఠ వివరం  - 18 పద్యాలు
అవతార కథనం              - 09 పద్యాలు
దుర్గ తత్వము                  - 19 పద్యాలు
అభ్యర్థనము                      - 23 పద్యాలు
                                              --- ------------
మొత్తం -                             109 పద్యాలు
                                              ------------

మొదటి పద్యం - అంగవర్ణనలో చూడండి-

అతసి కుసుమ కాంతి నవరాజితా సుమ 
చ్ఛవిని బొలుచు నీవు శివుని గూడి
గంగతోడనున్న కాళిందివలె నొప్పి
తివి మనోహరముగ నవని దుర్గ

ఇది ఉపమాలంకారంలో ఉన్నది.

అష్టాదశ శక్తిపీఠము వివరము లోని పద్యం -

లంకయందు నీవు శాంకరివనుపేర
వెలసితీవు భక్తసులభ - అయిన
లంక యిమిడినట్టి లవణాబ్దియందు నీ
యశము నిముడ జాలదయ్యె దుర్గ   - (41)

ఇది అధికాలంకారంలో ఉంది

అవతారకథనంలోని పద్యం-

విధిని వేధ వెట్టు మధుకైటభులఁబట్టి
నలిచినావు గుమిలి వలెనె యింక
శంబరాదు లెంత జగతి మహామాయ
వైన నాడు నీకు నవని దుర్గ  -  (59)

ఇది అర్థపత్తి అనే అలంకారంలో ఉంది.

ఈ విధంగా 109వ పద్యం -

సుఖమునిచ్చు సిరులు సుదతి మనోహరి
యరయకాపురంబె యవని స్వర్గ
మైననేమి బ్రతుకు లంగనాపాంగ చం
చలములగు గదమ్మ జగతి దుర్గ - (109)

ఇది విరుద్ధరససమావేశము అనే అలంకారంలో ఉంది.
ఇలాగా 109 పద్యాలు నూటతొమ్మిది అలంకారాల్లో కూర్చిన
ఈ కవిగారు ఎంతైనా అలంకారప్రియులకు అలంకారాలతో
విందు చేయించినారు. చాల చిన్న చిన్న మాటలతో కూర్చిన
ఈయనకు భాషపైనగల పట్టునకు నిదర్శనము.Tuesday, February 13, 2018

రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్


రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్సాహితీమిత్రులారా!సమస్య - 
రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్


వేలూరి శివరామశాస్త్రిగారి పూరణ-

ఆతఱిఁ సింగముఁజంపిన 
యాతని భల్లూక రాజు నటుతుములములో 
భీతిల్లఁజేసిన మురా
రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్

రాతికి రత్నముతోపాటు రమణికూడ దొరకడం ఏమిటి
ఇది అసంగతమేకదా కాని కవిగారి చాతుర్యంతో
రాతిని - మురారాతి(విష్ణువు/ కృష్ణుడు) గా మార్తడంతో
సుసంగతమైంది సమస్య సమసింది.

(తుములము - దొమ్మి యుద్ధము, బాహాబాహి)

Saturday, February 10, 2018

అవ్వ తాతా, టంకానగారా, రారాపోరా, మేనాసవారి


అవ్వ తాతా, టంకానగారా, రారాపోరా, మేనాసవారి
సాహితీమిత్రులారా!దత్తపది -
అవ్వ తాతా
టంకానగారా
రారాపోరా
మేనాసవారి - అనే పదాలను దత్తపదిగా
అర్జునుడు తిరస్కరించిన ఊర్వశి విరహానికి
అన్వయిస్తూ పూరించాలి

శ్రీపాద కృష్ణమూర్తిగారి పూరణ-

ఆపాకారి కుమారుఁడిట్లు విభవంబ వ్వారిగా రాఁగ, రా
రా పోరాయను సందడింబడు సుధర్మం జూచి నే నవ్వ తా
తా పాల్మాల వరింపకేగెనను వాఁడం కానగారా కహా
మీ పాలం బడితింజెలున్ మనుపరే మేనా నవారించితిన్